సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేందుకు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ కుమార్ శెట్కార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజాల్పూర్‌లోని ఈ తక్షల ప్రాంగణం 53వ జిల్లా స్థాయి బాల విద్యా వైజ్ఞానిక సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ కుమార్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీఈవో వెంకటేశ్వర్లు కలిసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మాట్లాడుతూ, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేందుకు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని కోరారు. హైదరాబాద్ ఐఐటీ సాధనలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసిన పాదయాత్రను గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఐటిఐ ఏటీసీ సెంటర్, మోడల్ డిగ్రీ కాలేజీలో పిజి సెంటర్ ఏర్పాటు వంటి చర్యలను చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా నారాయణఖేడ్ లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం విద్యార్థులకు పెద్ద ప్రోత్సాహమన్నారు. ఇటీవల జరిగిన ఉద్యోగ నియామకాల్లో నారాయణఖేడ్ విద్యార్థులు అధిక శాతం ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎంపీ–ఎమ్మెల్యేల సహకారంతో ఈ సదస్సు నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఈ సదస్సు మంచి అవకాశం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు సుమారు 700 వైజ్ఞానిక ప్రదర్శనలు సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించారు. మూడు రోజులపాటు పాల్గొనే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, ఉపాధ్యాయులు, సదస్సు నిర్వహణ బృందం పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలి: జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్
Published On: November 18, 2025 9:14 pm