ఎల్లారెడ్డి, అక్టోబర్ 7, (ప్రశ్న ఆయుధం):
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు.
సమావేశంలో కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, ఇటీవల భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పోచారం ప్రాజెక్ట్ బలోపేతం, సిల్ట్ తొలగింపు చర్యలు, ప్రాజెక్ట్ ప్రవాహం క్రింద అడవిలాగా పెరిగిన చెట్ల తొలగింపు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ— “గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి పనులకు తగిన నిధులు మంజూరు చేయాలని” మంత్రిని కోరారు.
దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, “ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన నిధులు త్వరలోనే విడుదల చేస్తాం” అని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ&సి, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు గారు పాల్గొన్నారు.