ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, జిల్లాలోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, జడ్పీ టీసీఆర్ ఓలు, ఎంపీటీసీ, ఆర్ఓలు, క్లస్టర్ అధికారులు, డీఎల్ పీఓలు, ఎంపీడీవోలు తహసిల్దార్లు, ఎంపీఓలకు ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ.. ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్ధవంతంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎం.పీ.టీ.సీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా, పూర్తి పారదర్శకంగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండో విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో జడ్పీటీసీ సభ్యుల నామినేషన్ల స్వీకరణ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నుండి అభ్యర్థుల తుది జాబితా ప్రకటన వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పాత్ర ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదన్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరణ స్కూటీని,విత్ డ్రా, గుర్తుల కేటాయింపు ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలలో పోటీలో నిలబడే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఖాతా ఎన్నికల నామినేషన్ల సమయంలో ఇవ్వాలని ఎన్నికల ఖర్చులు మొత్తం ఈ ఖాతా నుండే నిర్వహించాలని అన్నారు. ఎన్నికల్లో పోటీల్లో ఉండే అభ్యర్థులపై వచ్చే పెయిడ్ ఆర్టికల్ వార్తలను ఎన్నికల సిబ్బంది సేకరించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమ నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించాలని నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులకు నోడల్ అధికారులకు మండల స్థాయి అధికారులకు కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని అన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్.ఓ, ఏ.ఆర్.ఓల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీ.ఈ.ఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని, దీనివల్ల ఎన్నికల నిర్వహణలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త పడవచ్చని హితవు పలికారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ప్రతి రోజు త్వరితగతిన డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే, అవి తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిగితే, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమాత్రం సంకోచించకుండా పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఏ దశలోనూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని ,ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నిక ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. 

*ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి:*

*జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్* 

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో పాటు బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాల వరకు తరలింపు ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములకు తరలింపు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు రూట్ల వారీగా సిబ్బందిని నియమించి ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీపీఓ సాయిబాబా, ఆర్ఓలు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment