సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): పత్తి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సీసీఐకి పత్తి విక్రయించాలంటే కపాస్ కిసాన్ యాప్ లో తప్పని సరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మల్లేశం అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కపాస్ కిసాన్ యాప్ ఫై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ల అధికారులకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రియాజ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పత్తి రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సీసీఐకి పత్తి విక్రయించాలంటే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకుని సిసిఐ కేంద్రానికి పత్తిని తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో పత్తి కొనుగోళ్ల కోసం కొత్త “కపాస్ కిసాన్” యాప్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలు నాణ్యమైన పత్తికి రూ. 8110 రూపాయలు మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నూతన యాప్ పై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో వివరాల నమోదుతో సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ *18005995779* కేటాయించినట్లు తెలిపారు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని యాప్ లో రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, గ్రామము, రైతు పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్, పంట సాగు చేసిన సర్వే నెంబర్, విస్తీర్ణం కులము, ఫోన్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసి రైతు ఫోటోని అప్లోడ్ చేస్తే స్లాట్ బుకింగ్ తేదీ వస్తుందని ఆరోజు రైతులు తమ పత్తి పంటను సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. పత్తి కొనుగోలులో దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించడంలో కపాస్ కిసాన్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యాప్ పై వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ సిబ్బంది తమ పరిధిలోని రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి రైతులందరూ ఈ యాప్ లో తమ వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
పత్తి రైతుకు మద్దతు ధర కొరకు స్లాట్ బుకింగ్ తప్పని సరి: మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మల్లేశం
Published On: October 7, 2025 6:19 pm