పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): అక్టోబర్ 12 నుండి 14 వరకు నిర్వహించే పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ ఆధ్యర్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,88,895 మంది 0-5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వీరందరికి పల్స్ పోలియో చుక్కల మందు వేయాల్సి ఉందని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే ద్వారా అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ, మున్సిపల్ కమిషనర్లు ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో, పట్టణాలలో టాం టామ్ ల ద్వారా గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయా గ్రామాలలో పట్టణాలలో జరిగే పల్స్ పోరియో కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది 1583, అంగన్వాడి సిబ్బంది 1505 ,ఆశా వర్కర్లు 904 మంది సిబ్బందితో పల్స్ పోలియో ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగనిర్మల కలెక్టర్ కు తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల ద్వారా అవగాహన ర్యాలీలు నిర్వహించాలన్నారు. అంగన్‌ వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు సిడిపిఓలు అందరూ టీకా శిక్షణలు, పల్స్ పోలియో కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేలా సూచనలు ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ, అధికారి లలిత కుమారిని ఆదేశించారు. జిల్లా విద్యా అధికారి ఆధ్వర్యంలో మండలాధికారుల సమన్వయంతో మండల స్థాయిలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షలు నిర్వహించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ట్రాన్సిట్ బూతుల ఏర్పాటుకు ఆర్టీసీ సిబ్బంది ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం స్వచ్ఛంద సంస్థలైన రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, ఐఎంఏ, జీహెచ్ఎంసీ సిబ్బంది స్వచ్ఛందంగా భాగస్వాములయ్యేల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో జానకి రెడ్డి, డీడబ్ల్యుఓ లలిత కుమారి, అడిషనల్ డిఆర్డిఓ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now