పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లలో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం వంద శాతంగా ఉండాలని, వివిధ సబ్జెక్టులలో వెనకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధతో బోధన చేపట్టాలని సూచించారు. పాఠశాలల్లో ఈజీఎస్ కింద మంజూరైన మరుగుదొడ్లన్నింటినీ వెంటనే గ్రౌండింగ్ చేయాలని, రెండు రోజుల్లో ఏజెన్సీలను గుర్తించి, రెండు నెలల లోపు అన్ని టాయిలెట్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పనులను పంచాయతీరాజ్ శాఖ మిషన్ మోడ్‌లో చేపట్టాలని, ఎప్పటికప్పుడు ఫాలప్ చేసి పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎంఈఓలదని స్పష్టం చేశారు. వినియోగించిన నిధులకు సంబంధించి యూసీలను ఎప్పటికప్పుడు సమర్పించాలని అన్నారు. వినియోగంలో ఉన్న మరుగుదొడ్ల వివరాలను సంబంధిత పోర్టల్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలని, వినియోగంలో లేని మరుగుదొడ్లను మరమ్మత్తులు చేపట్టి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్, శానిటేషన్ గ్రాంట్‌లను పూర్తి స్థాయిలో వినియోగించాలని అన్నారు. పి.ఎం.శ్రీ పాఠశాలల కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో, పారదర్శకంగా వినియోగించాలన్నారు. పి.ఎం.శ్రీ పాఠశాలల్లో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎంఈఓలు వ్యక్తిగతంగా పర్యవేక్షణలో పాల్గొనాలని తెలిపారు. విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్స్, ఎక్స్‌పోజర్ విజిట్స్ నిర్వహించడంతో పాటు క్రీడా పరికరాల కొనుగోలు, క్రీడల నిర్వహణ వంటి అంశాలకు నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. కేజీవీబీలు, టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఈఐఎస్ పాఠశాలల్లో ఈజీఎస్ కింద చేపడుతున్న టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, మరమ్మత్తుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎంఈఓలు తమ పరిధిలోని అన్ని పాఠశాలలను నిరంతరం సందర్శించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎంఆర్ సెంటర్లకు ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్ యూనిట్ ను అందిస్తున్నామని, వాటితో మొదటగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రేరణాత్మక సినిమాలు ప్రదర్శించి స్ఫూర్తి కలిగించాలన్నారు. అనంతరం అన్ని జడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని సూచించారు. ఇవే యూనిట్లను కాంప్లెక్స్ మీటింగ్స్, టీచర్ల ట్రైనింగ్స్‌కు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 52 రోజుల ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్‌డీఓ జ్యోతి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓలు, ఈడబ్ల్యూడీఐసీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, హెడ్‌మాస్టర్లు, సెక్టర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment