సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని జిల్లాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని, ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని, దాన్ని గుర్తించి దిశా నిర్దేశ్యం చేస్తే భవిష్యత్తులో ఆ పిల్లలు ధైర్యంగా స్వయం కృషితో ఎదగాలని మంత్రి అన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులు, యువకుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. సంగారెడ్డి ఐటీఐ సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో 1963లో ప్రారంభించబడిందన్నారు. 63 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐటిఐగా సంగారెడ్డి ఐటీఐ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన ఎంతో మంది బీహెచ్ఈఎల్, ఓడిఎఫ్, బీడీఎల్ లాంటి జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందారన్నారు. ప్రస్తుతం ఐటీఐతో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఐటీఐతో పాటు ఇతర నైపుణ్యాలలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ పై శిక్షణ అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో మూడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, పటాన్చెరు, హత్నూర ఐటీఐ లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఏటిసి కేంద్రం ఏర్పాటుకు సుమారు 40కోట్ల రూపాయలను అధునాతన పరికరాలకు కొనుగోలు కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహాయకారంతో ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ కేంద్రాలు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను నేర్పి పోటీ ప్రపంచంలో విజయవంతంగా ఉపాధి పొందేందుకు సహాయ పడతాయని అన్నారు. కేవలం అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా స్ఫూర్తి స్ఫూర్తి పొందాలని అన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా కొత్త టెక్నాలజీలను నేర్చుకొని భవిష్యత్తులో స్వయం కృషితో ధైర్యంగా ముందుకు వెళ్తారన్న విశ్వాసాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వ్యక్తం చేశారు. ట్రైనింగ్ కేంద్రంలో ఫ్యూచర్ జాబ్స్‌కు కావాల్సిన కొత్త టెక్నాలజీలు, స్కిల్స్ పై శిక్షణ అందిస్తున్నారని, గతంలో అడ్మిషన్లలో సీట్లు నింపడం కష్టమయ్యేది, ఈసారి 172 సీట్లు ఓపెన్ చేసినందున 380 మంది కొత్త అడ్మిషన్స్ పూర్తి అయ్యాయని, ఇప్పుడు ఏటీసీలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విద్యార్థులు కళాశాలకు 100శాతం హాజరు కావడానికి కృషి చేయాలని, విద్యార్థులు తమ సందేహాలను ఉపాధ్యాయుల నుండి స్పష్టంగా తెలుసుకుని, సహజంగా ఆచరించాలని సూచించారు. మన జిల్లాలో 4వేలకు కి పైగా ఇండస్ట్రీస్ ఉన్నందున, ఈ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులు ఆ ఇండస్ట్రీస్‌లో ప్లేస్‌మెంట్స్ పొందే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను అమలుచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 వేల ఉద్యోగాలు కల్పించడం గర్వకారణమని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం గర్వించదగ్గ విషయం అని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, జహీరాబాద్ నిమ్స్‌లో స్థానికులకు ప్రత్యేక అవకాశం కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, అదనపు లేబర్ కమిషనర్ గంగాధర్, ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పోటీ ప్రపంచంలో నిలబడాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published On: September 27, 2025 5:52 pm