సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశాన్ని శక్తివంతమైన, సుస్థిరమైన దేశంగా తీర్చడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సేవకులు కీలకపాత్ర పోషించాలంటూ తెలంగాణ ప్రాంత భౌతిక ప్రముఖ్ కూర జగదేకరావ్ పిలుపునిచ్చారు. గుమ్మడిదలలో ఆదివారం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలంటే ప్రతి యువకుడు ఆర్ఎస్ఎస్ సేవకుడిలా క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని, ఆర్ఎస్ఎస్ సేవకులు దేశ రక్షణ, సమాజ సేవలో ఎల్లప్పుడూ అగ్రగాములుగా నిలుస్తున్నారు. ధర్మం, దేశం, సమాజం అనే త్రివిధ పునాదులపై నిలిచిన ఈ సంస్థ భారతీయ సంస్కృతిని కాపాడుతూ శతాబ్దాన్ని పూర్తి చేసుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రూట్ మార్చ్ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. గుమ్మడిదల ప్రధాన వీధుల గుండా క్రమశిక్షణతో ఊరేగారు. దేశభక్తి నినాదాలతో గుమ్మడిదల వీధులు మారుమ్రోగాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపక్కన నిలబడి వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా భౌతిక ప్రముఖ్ మేకల శ్రీకాంత్, దేవాలయ కమిటీ చైర్మన్ ముద్దుల బాల్ రెడ్డి, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ఉదయ్, వెంకటేష్ మండల కార్యవాహకులు తదితరులు పాల్గొన్నారు.
శక్తివంత దేశంగా తీర్చడంలో ఆర్ఎస్ఎస్ సేవకులు కీలకపాత్ర పోషించాలి: తెలంగాణ ప్రాంత భౌతిక ప్రముఖ కూర జగదేకరావ్
Published On: October 5, 2025 9:20 pm