సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలు పాటిస్తూ, శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని అన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వస్తుందని, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లలో తగిన వసతులు కల్పించేందుకు సంబంధిత అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంపీపీలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు స్థానిక స్థాయిలో ఎంసీసీ అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి ఎన్నికల సామగ్రి, సిబ్బంది, రవాణా తదితర ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో స్థానిక ఎన్నికల సమాచారం కోసం తెలుసు కోవడానికి సంగారెడ్డి జిల్లా పరిషత్ లో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 8125352721ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు, సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా ఈ హెల్ప్ లైన్ ద్వారా వెంటనే సమాచారం తెలుసుకోవచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, అదనపు జడ్పీ సీఈఓ స్వప్న, డీపీఓ సాయిబాబా, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: September 29, 2025 9:35 pm