సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికలు-2025 నేపథ్యంలో జిల్లాలో ఎంపిక చేసిన ఫ్లయింగ్ స్కాడ్ టీం సభ్యులకు, జోనల్ అధికారులు, స్టాటికల్ సర్వే లైన్స్ టీం సభ్యులు, సహాయ వ్యయ పరిశీలకులకు మాస్టర్ ట్రైనర్ లతో అవగాహన, శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అధికారులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్క అధికారి కేటాయించిన బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. తమ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో రెండు విడతలలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల వివరాలను అదనపు కలెక్టర్ అధికారులకు వివరించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకారం అధికారులు ఎన్నికల నిబంధనల అమలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిశీలన, చెక్ పోస్ట్లు ఏర్పాటు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ లతో ఎన్నికల విధానం పర్యవేక్షణ చర్యలు రికార్డుల పరిశీలన వ్యయ పరిశీలన విధానం అధికారులకు సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వే లైన్స్ టీంలు తక్షణం విధుల్లోకి వచ్చి ప్రజల్లో ఎన్నికల పట్ల నమ్మకం కలిగించేలా పని చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్రస్థాయిలోకి సంబంధిత టీంలు వెళ్లి వాస్తవాలను పరిశీలించి, ఎంసీసీ కోడ్ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడీఎస్ సీ కార్పొరేషన్ అధికారి రామాచారి, రెవెన్యూ శాఖ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: October 7, 2025 7:07 pm