నిజామాబాద్లో BMB మల్టీ లెవెల్ చైన్ మోసం… నిందితుల అరెస్ట్
నిజామాబాద్, నవంబర్ 20: ప్రశ్న ఆయుధం)
మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట ప్రజలను మోసగిస్తున్న BMB చైన్ సిస్టమ్ పై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయంటూ ఆకట్టుకునే ప్రకటనలకు ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు.
తోకల బక్కన్న అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. అక్టోబర్ 13న కోటగల్లీలోని కెనరా బ్యాంక్ వద్ద ఉన్నట్లు చెప్పిన BMB కంపెనీ కార్యాలయానికి వెళ్లిన ఫిర్యాదుదారుకు నిందితుడు చంద్రశేఖర ప్రసాద్ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే లాభాలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు అందుతాయని నమ్మబలికినట్లు తెలిసింది. నిందితుడు పంపిన లింకుల ద్వారా ఫిర్యాదుదారుడు రూ. 84,398 పెట్టుబడి పెట్టగా, యాప్లో కనిపించిన ఫేక్ అమౌంట్ను విత్డ్రా చేయలేకపోవడంతో మోసమని గ్రహించాడు.
దర్యాప్తులో నిందితుడు ఇప్పటివరకు 22 మందిని మోసం చేసినట్లు, అంతకుమించి ఈ BMB యాప్ కారణంగా 750 మంది వరకు మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం నష్టం రూ. 1 కోట్ల నుండి 1.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. యాప్, లింకులు అన్నీ చైనా ఆధారితమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
ప్రజలు ఇలాంటి వేగంగా లాభాలు వస్తాయని చెప్పే MLM/చైన్ మార్కెటింగ్ స్కీములకు లోను కాకుండా, అనుమానాస్పద వ్యక్తులు, సంస్థలు గమనిస్తే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.