సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండల పరిధిలోని ఓఆర్ఆర్ జంక్షన్ నుండి ఇంద్రేశం మీదుగా బేగంపేట వరకు గల రహదారిని 30 లక్షల రూపాయల సొంత నిధులతో మరమ్మతులు చేపడుతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రేశం పరిధిలో చేపడుతున్న రహదారి మరమ్మతు పనులను ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఇంద్రేశం, బచ్చుగూడ, పోచారం, రామేశ్వరంబండ, పెద్దకంజర్ల, ఐనోలు, చిన్నకంజర్ల గ్రామాల పరిధిలో గృహనిర్మాణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందడం మూలంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరిగిందని తెలిపారు. నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణాలు సాగిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రహదారి విస్తరణ కోసం 22 కోట్ల రూపాయలు మంజూరు కాగా.. సాంకేతిక కారణాల మూలంగా నిధులు రద్దు అయ్యాయని తెలిపారు. తిరిగి రహదారి విస్తరణ కోసం ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తి స్థాయి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రెండు నెలల క్రితం 20లక్షల రూపాయల సొంత నిధులతో గుంతలు పూడ్చడంతో పాటు ప్యాచ్ వర్క్ చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. భారీ వర్షాల మూలంగా రహదారి అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న సంకల్పంతో తిరిగి 30లక్షల రూపాయల సొంత నిధులతో ఇంద్రేశం నుండి ఐనోలు మీదుగా బేగంపేట వరకు రహదారి మరమ్మతుల పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పూర్తి స్థాయి మరమ్మతుల కోసం ప్రభుత్వం 80 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మరమ్మత్తులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బీ డీఈ రవీందర్, ఏఈ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, బండి శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
30 లక్షల రూపాయల సొంత నిధులతో ఇంద్రేశం రహదారి మరమ్మతులు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published On: August 15, 2025 7:08 pm