సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎం.పీ.టీ.సీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు, గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా లో 25 జడ్పీటీసీ, 261 ఎం.పీ.టీ.సీ స్థానాలకు రెండు విడతలలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలకు గాను తొలి విడతలో 334 జీ.పీలు, 2872 వార్డులు, రెండవ విడతలో 279 జీ.పీలు, 2498 వార్డులో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ, వారికి మలివిడత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉందని, షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన దృష్ట్యా పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలతో కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తామని అన్నారు. వీ.సీ అనంతరం కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్, ఆర్డిఓలు,ఎంపిడిఓలు తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్లు వద్ద ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ బృందాలలు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు .ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పని చేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ విధులు బాధ్యతతో కూడుకుని ఉన్నందున ఎంతో అప్రమత్తంగా పని చేయాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని హితవు పలికారు. ఏవైనా సందేహాలు ఉంటే పై స్థాయి అధికారులను సంప్రదించి ముందుగానే నివృత్తి చేసుకోవాలని, ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న దృష్ట్యా, తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డీపీఓ సాయిబాబా, ఆర్డిఓలు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Updated On: September 29, 2025 9:59 pm