సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణలో అతి త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిపార్టీలు యువతకు జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలని నవ భారత్ నిర్మాన్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువత పాత్ర కీలకంగా మారిందని, అన్ని పార్టీల జెండాలను అజెండాలను యువత తమ భుజస్కందాల పై మోసి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో యువత పాత్ర కీలకమని మెట్టు శ్రీధర్ అన్నారు. ఆధునిక యుగంలో సోషల్ మీడియా ద్వారా అన్ని పార్టీల కార్యకలాపాలను ప్రజల వద్దకు చేర్చడంలో యువత పాత్ర కీలకమని, భవిష్యతులో బలమైన నాయకత్వాన్ని దేశానికి అందించడానికి రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత అధికంగా ఇవ్వాలని మెట్టు శ్రీధర్ తెలిపారు. చదువుకున్న యువతరం రాజకీయాల్లోకి రావడం వల్ల అనేక రాజకీయ సామాజిక అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉండి విద్య వైద్యం, ఆరోగ్యం, ఉపాధి విషయాలలో ఆధునిక సాంకేతికతను జోడించి అభివృద్ది పథంలో గ్రామాలను యువ నాయకత్వం నడిపిస్తుందని మెట్టు శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల్లో యువతకు అధిక సీట్లు కేటాయించి దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించాలి: నవ భారత్ నిర్మాన్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్
Published On: September 29, 2025 10:13 pm