సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది గ్రామ కారోబార్ మల్లేశం రాజీనామా పత్రాన్ని జిల్లా అధికారులు గురువారం ఆమోదించారు. ఇప్పటికే సెప్టెంబర్ 9న మల్లేశం తన రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు ఆమోదం ఆలస్యం కావడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. కారోబార్ మల్లేశం గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు ఇవ్వడంలో ముఖ్య పాత్ర వహించాడని మాజీ వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కంది మాజీ వార్డు సభ్యుడు ఆనందరావు ఇటీవల జిల్లా కలెక్టర్, డీపీవోలకు మరోసారి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదే నేపధ్యంలో అధికారులు మల్లేశం రాజీనామాను అధికారికంగా ఆమోదించారు. ఈ పరిణామంపై గ్రామస్తులు, మాజీ వార్డు సభ్యులు మాట్లాడుతూ… కారోబార్ మల్లేశం పదవిలో ఉన్న సమయంలో జరిగిన అక్రమ నిర్మాణాలు, వెంచర్ల అనుమతులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కంది కారోబార్ మల్లేశం రాజీనామా ఆమోదం..
Updated On: October 16, 2025 9:56 pm