సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజిలెన్స్ బలోపేతం, ఆధారాలు సేకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై పౌరసరఫరాల శాఖ నమోదు చేసిన 6-ఏ కేసుల పురోగతి పై పౌరసరఫరాల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, పోలీస్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ), డీఎం సివిల్ సప్లై, పోలీసు అధికారులు, ఏసీటీఓ, సాంకేతిక సహాయకులు, డిప్యూటీ తహసీల్దార్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కేసుల పరిశీలనలో వేగం తీసుకురావాలని, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. బియ్యం అక్రమ రవాణా వాహనాలను పట్టుకున్నప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా వీడియో, ఫోటో ఆధారాలను సేకరించి, 6-ఏ నివేదికకు జతపరిచి సమర్పించాలన్నారు. సాంకేతిక సహాయకులు నమూనాలను వాహనం నంబరు, స్వాధీనం తేదీతో ప్రత్యేక బ్యాగులో భద్రపరచాలి. విశ్లేషణ ప్రక్రియను ఫోటో ,వీడియో కవరేజ్ చేయాలన్నారు, వాటిని నివేదికతో సమర్పించాలని, బియ్యం రవాణాకు సంబంధించిన బిల్లులను ఏసీటీఓ అధికారులు ఒక రోజులోగా పరిశీలించి, వాహన రాకపోకల మూలాన్ని నిర్ధారించాలని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణా బియ్యంను ప్రతి 15 రోజులకు ఒకసారి పత్రికలలో ప్రకటన ఇచ్చి, బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని సూచించారు. కోర్టులలో ప్రభుత్వ ప్రయోజనాలను రక్షించేందుకు, డీసీఎస్ఓ ప్రభుత్వ న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశమై సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరియు నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాధురి, డిఎం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్, కమర్షియల్ టాక్స్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 23, 2025 6:31 pm