జిల్లాలో యాసంగి అవసరాలకు సరిపడా అందుబాటులో యూరియా నిల్వలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్ లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య భరోసా కల్పించారు. యూరియాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలలో యూరియా సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామని, పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 4852 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సొసైటీలు, ఆగ్రో కేంద్రాలు, హెచ్ ఏసిఏ, డిసిఎంఎస్ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. యూరియా విడతల వారీగా సరఫరా చేయబడుతుందని, రైతులు ఎవరూ ఎటువంటి ఆందోళనకు లేదా అపోహలకు గురికావద్దని తెలిపారు. రేపటి( మంగళవారం) నుండి ఉదయం 6గంటల నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డిసిఎంఎస్ కేంద్రాలు ఎరువుల విక్రయాలు ప్రారంభించేలా సూచించామని తెలిపారు. ఏదైనా కేంద్రంలో రద్దీ ఎక్కువగా ఉంటే, రైతులు ఎక్కువసేపు క్యూ లో వేచి ఉండకుండా మల్టిపుల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, అన్ని PACS, సొసైటీలు మరియు అగ్రో కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా షామియానాలు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించామని పేర్కొన్నారు. త్వరలో జిల్లాలో కూడా QR కోడ్ యాప్ ద్వారా రైతులకు ఎరువుల సరఫరా ప్రారంభించబడుతుందని తెలిపారు. రైతులందరూ ప్రశాంతంగా ఉండి, అవసరమైనప్పుడు మాత్రమే యూరియా కొనుగోలు చేయవలసిందిగా ఆమె కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment