హైదరాబాద్, డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ మరియు ప్రచురణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) సోమవారం (డిసెంబర్ 29, 2025) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.వార్డుల వారీగా ఓటర్ల విభజన:
అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.
ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ఇదే..
ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటాను మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరించడం 30.12.2025.
వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజన 31.12.2025.
మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన 31.12.2025.
(Draft) ఓటర్ల జాబితా ప్రచురణ (అభ్యంతరాల స్వీకరణ) 01.01.2026.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం (ULB/జిల్లా స్థాయి) 05.01.2026 – 06.01.2026.
తుది ఓటర్ల జాబితా (Final Roll) ప్రచురణ 10.01.2026.
జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే నోటీసు బోర్డుల ద్వారా తెలియజేయవచ్చు. అన్ని సవరణల తర్వాత జనవరి 10, 2026న తుది జాబితాను విడుదల చేస్తారు.
ఈ జాబితా ఆధారంగానే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది.