తెలంగాణ నాగ్వార్ లో పత్తి కొనుగోలు కేంద్ర ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా by Donthi Mahesh Published On: November 8, 2024 6:57 pm సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని నాగ్వార్ గ్రామంలో ఎస్.బి.ఎఫ్ కాటన్ కార్పొరేషన్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. ఈ సంవత్సరం పత్తి దిగుబడి బాగా రావడం, సకాలంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులు మేలు జరుగుతుందని తెలిపారు.పత్తి రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది. ఈ కేంద్రం ద్వారా పత్తి రైతులకు తమ పంటకు కేంద్ర ప్రభుత్వం అందించే సురక్షితమైన ధర అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోబడినట్లు మంత్రి తెలిపారు. రైతులు తమ పత్తిని మంచి ధరకు విక్రయించుకోవాలని సూచించారు. రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు పత్తిని బాగా ఆరబెట్టుకోవాలని సూచించారు. ఆరబెట్టడం ద్వారా పత్తి తూకం కచ్చితంగా ఉండి మంచి ధర అందే అవకాశం ఉంటుంది. తేమ శాతం 8 నుండి 12 లోపు వుండే విధంగా చూసుకోవాలమని రైతులకు మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పత్తి రకాలకు అనుగుణంగా,మేలు రకం పత్తి: రూ. 7521, మధ్య రకం పత్తి: రూ. 7471, మూడోవ రకం పత్తి: రూ. 7121 ధరలు ఉన్నాయని తెలిపారు. ఈ ధరలు మార్కెట్లో రైతులకు మంచి ఆదాయాన్ని అందించే అవకాశం కల్పిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం ద్వారా సురక్షితమైన ధరలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పత్తి కొనుగోలు కేంద్రం నందు రైతులకు అవసరమైన సౌకర్యాలు, ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), వ్యవసాయ, మార్కెట్, రవాణా శాఖ అధికారులందరూ సహకరించేందుకు సిద్ధంగా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ పత్తి కొనుగోలు కేంద్రం ను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం ప్రత్యేక అధికారి జగదీష్, ఆర్.డి.ఓ రామిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఏ.డి.ఏ సత్యనారాయణ, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Post Views: 12