సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహమును, కేజీబీవీ బాలికల పాఠశాలను, ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి దారులతో మాట్లాడారు. త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధి దారులకు అందించాలన్నారు. కస్తూర్భా బాలికల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు. అభ్యాస దీపికలో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పాఠ్యాంశాలను చేతిరాతతో రాస్తూ చదువుకోవాలని విద్యార్థులకు తెలిపారు. కస్తూర్భా పాఠశాల విద్యార్థులతో చదువు, యోగా, మెడిటేషన్, కృత్తిమ మేథా (ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ) పై పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు చక్కగా సమాధానాలు చెప్పడం తో విద్యార్థులను ప్రశంసించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కిషన్ షెడ్ ను, స్టోర్ రూమ్ ను, పరిశీలించారు. ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కు నూతన మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని వసతి గృహ సంక్షేమ అధికారికి కలెక్టర్ సూచించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్టు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు సమయం దగ్గర పడుతున్నదని విద్యార్థులు కష్టపడి చదవాలని విద్యాశాఖ తరఫున అందజేసిన స్టడీ మెటీరియల్ చదవాలని సూచించారు. చదువుకుంటేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మంచి భవిష్యత్తు కోసం విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని కిచెన్ షెడ్డును స్టోర్ రూమ్ ను డైనింగ్ హాల్ ను కలెక్టర్ పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ చలపతి రావు, ఏఈ మాధవ రెడ్డి, కొండాపూర్ ఎంపీడీవో, తహసిల్దార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.