దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి ప్రతినిధి, మే 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచి దేశవ్యాప్తంగా కులగణనకు బాటలు వేసినందుకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పూల బొకే అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ కుల గణన కోసం గొంతు ఎత్తాడని వివరించారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేపట్టడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ దారి చూపాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. రేవంత్ రెడ్డి చొరవతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కులగణన కోసం నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జనగణనతో పాటు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో కులగణన చేపట్టిన విధానంలోనే దేశవ్యాప్తంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ తరహాలో తెలంగాణలో పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను యావద్దేశమే గర్విస్తుందన్నారు. బీసీ కుల గణన చేపట్టి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు బిల్లు పెట్టి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా కుల గణన జరిగేట్లు చర్చ తీసుకుని వచ్చి అనుకున్నది సాధించిన రేవంత్ కు బీసీ వర్గాలు ఋణపడి ఉంటాయన్నారు. బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ కు నీలం మధు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now