సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, కూడా ఉన్నారు. ప్రమాద స్థితిని మంత్రులు, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, స్థానిక అధికారుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన స్థలంలో సహాయక చర్యలు మరింత వేగంగా, సమర్థంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన పునరావృతం కాకుండా భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు ఇవ్వడం, బాధితులకు వెంటనే సహాయం అందించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని, అవసరమైన నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ దృష్టి అని సీఎం స్పష్టం చేశారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Published On: July 1, 2025 12:04 pm
