ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ ! 22 మంది మావోలు మృతి !

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ ! 22 మంది మావోలు మృతి !

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్ – దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోయిస్ట్ లు మృతి చెందారు. బీజాపూర్ – దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు జాయింట్ టీమ్ బయలుదేరింది.

ఆపరేషన్ సమయంలో భద్రతబలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీనితో గురువారం ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా… ఘటనస్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. దీనితో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బీజాపూర్ డీఆర్జీకి చెందిన ఒక సైనికుడు ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగులుతోంది. ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతోంది. ఈరోజు బీజాపూర్‌ లో అతిభారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు 22 మంది మావోలు హతమవగా… ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం చుట్టూ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now