అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంటి లోపల నిలిపి ఉంచిన బైక్ ఇంజిన్ నుండి వెలువడిన పొగను పీల్చడం వల్ల తాత, ముగ్గురు మనవళ్లు, మనవరాళ్లు ఊపిరాడక మృతి చెందారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, రాత్రంతా బైక్ ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచి, దానిని ఇంటి లోపల ఉన్న గదిలోనే ఉంచారు. ఆ గదిలోనే కుటుంబ సభ్యులు నిద్రించడంతో, ఇంజిన్ నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు గదిలో పేరుకుపోయింది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, తాతతో పాటు ముగ్గురు పిల్లలు అపస్ఫృహతో కనిపించారు.
వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో తాతతో పాటు ఇద్దరు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బైక్ సర్వీసింగ్ అనంతరం ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా, ఇంట్లో లేదా మూసి ఉన్న ప్రదేశాలలో వాహనాల ఇంజిన్లను ఆన్‌లో ఉంచడం, వాటిని నిలిపి ఉంచడం వంటివి చేయరాదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతోంది.







