సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుండె పోటు లేదా శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చిన వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయగలిగితే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడు ఈ జీవరక్షణ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సీపీఆర్ పై జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భముగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుతో సంభవించే మరణాలను సీపీఆర్ తో నిలుపుదల చేయవచ్చని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సీపీఆర్ ప్రాముఖ్యతను, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే నైపుణ్యం ప్రతి ఉద్యోగికి అవసరమని అభిప్రాయ పడ్డారు. సీపీఆర్ పద్ధతులను ప్రదర్శిస్తూ, గుండె మసాజ్, కృత్రిమ శ్వాస పద్ధతులపై వైద్యాధికారులు డా.శశికిరణ్, డా. దీప్తి, డా.జైపాల్ రెడ్డి ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మాజరాణి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా.నాగనిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: October 27, 2025 6:04 pm