కామారెడ్డి జిల్లాలో యూరియా ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతుండటంతో అక్రమ నిల్వలు, మళ్లింపులకు అడ్డుకట్ట పడుతోందని వివరించారు.
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గినా, రైతులు ముందస్తు అవసరాల దృష్ట్యా యూరియాను అధికంగా కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయానికి 5,571 ఎకరాల్లో వరి నాట్లు నమోదు కాగా, ఈ ఏడాది 250 ఎకరాల్లోనే పూర్తయ్యాయని తెలిపారు. అయినప్పటికీ, గత ఏడాది ఇదే తేదీ నాటికి 2.37 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేయగా, ఈసారి ఇప్పటికే 2.64 లక్షల బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం జిల్లాలో 65 వేల యూరియా బస్తాలు నిల్వలో ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా అదనపు నిల్వలను నిరంతరం సమకూరుస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 1.25 లక్షల ఎకరాల్లో వరి నర్సరీలు పెంచిన నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల బస్తాలకు పైగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు. యూరియా లభ్యతపై ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనలకు గురికాకుండా అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు.












