కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ శనివారం ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అన్నసాగర్ వరి కొనుగోలు కేంద్రంలో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్ సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను, సూచనలను అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు.
కేంద్రం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, రైతుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్యాబ్ ఎంట్రీలను సకాలంలో నమోదు చేయడం, ప్రభుత్వం నిర్దేశించిన FAQ నిబంధనలను పాటించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
రైతులకు అవసరమైన టార్పాలిన్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత, సమయపాలన పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సర్పంచ్, ఎల్లారెడ్డి RDO, DCSO, DCO, DMCS, రెవెన్యూ శాఖ అధికారులు, IKP సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.











