రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, సహకార సంఘాలు, ఎఫ్ పీఓల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "యదా బీజం తదా సస్యం" అనే సూత్రాన్ని ప్రస్తావించారు. నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన వివరించారు.
జిల్లాలో పత్తి, వరి, జొన్న, సోయాబీన్, కందులు, మినుములు వంటి ప్రధాన పంటలకు అవసరమైన విత్తనాలను సమయానికి అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారని, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన పెంపు అత్యవసరమని ఆయన అన్నారు. వరితో పాటు పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.
విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, కఠిన ప్రమాణాల ప్రకారం పరీక్షించి, ధృవీకరించిన విత్తనాలనే అందిస్తుందని అన్వేష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలనే డీలర్లు విక్రయించాలని, ప్రతి డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను రైతులకు అందించాలని కోరారు. త్వరలో అమల్లోకి రానున్న నూతన విత్తన చట్టం రైతుల హక్కులను, డీలర్ల ప్రయోజనాలను కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.
నకిలీ విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి కె. శివప్రసాద్ హెచ్చరించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరపరాదని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు కృత్రిమ కొరత సృష్టించరాదని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో హెచ్‌టీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మే 4 నుంచి 9 వరకు నిర్వహించే "ఫార్మర్స్ వీక్" సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై ఫిర్యాదుల కోసం 8712656777 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నకిలీ విత్తనాల విక్రయంపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ సత్తయ్య గౌడ్ హెచ్చరించారు.












