సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి (RAD), తేనెటీగల పెంపకం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో, కలెక్టర్ ప్రావీణ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన ఫార్మ్ మెకనైజేషన్ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను వెంటనే సమర్పించాలని అధికారులకు సూచించారు. రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.
ఉద్యాన యాంత్రీకరణ పథకం కింద మినీ ట్రాక్టర్లు, పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్ వంటి యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 97 యూనిట్లు మంజూరయ్యాయని, ఈ పథకం ద్వారా రైతులు ఆధునిక పరికరాలను సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు.
వర్షాధార ప్రాంతాల అభివృద్ధి (RAD) పథకం కూడా రైతుల ఆదాయాన్ని పెంచడం, ఆహార భద్రతను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ వివరించారు. ఈ పథకాల అమలులో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్డీఏ శాఖల మధ్య సమన్వయం అవసరమని ఆమె సూచించారు.
తేనెటీగల పెంపకాన్ని మరింత విస్తరించాలని, ఎక్కువ మంది రైతులకు బీహైవ్ యూనిట్లు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు కమర్షియల్ స్థాయిలో తేనెటీగల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రోత్సాహం అందించాలని డీఆర్డీఏ అధికారులకు సూచించారు.












