కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పంటల మద్దతు ధరల (ఎంఎస్పీ) పెంపునకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. జీవో ప్రతులను దగ్ధం చేసిన నాయకులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద గురువారం ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరల పెంపునకు సంబంధించిన జీవో ప్రతులను నాయకులు దగ్ధం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలు అవలంబిస్తోందని ఎస్కేఎం నాయకులు ఆరోపించారు.
ఎస్కేఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య, నాయకులు పి. వెంకటేశ్, బి. బాబన్న మాట్లాడుతూ, రైతు పంటలకు నామమాత్రంగా మాత్రమే మద్దతు ధరలు పెంచి కేంద్రం చేతులు దులుపుకుందని విమర్శించారు. వరి క్వింటాల్‌కు రూ.72, మొక్కజొన్నకు రూ.10, పెసర్లకు రూ.12 మాత్రమే పెంపు చేయడం రైతులను అవమానించడమేనని పేర్కొన్నారు.
మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలను బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు పెంచడంతో పాటు క్రిమిసంహారక మందుల ధరలు కూడా అధికం చేశారని, దీంతో రైతులపై అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ‘సీ2 + 50 శాతం’ సూత్రంతో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక చట్టాల కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడుతోందని, రైతులు అప్పుల పాలవుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ కల్పించే ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని, విత్తన, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలను రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.








