గజ్వేల్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రైతులకు బేడీలు వేసిన చరిత్ర కలిగిన వ్యక్తి అని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. "ఇద్దరూ రైతు ద్రోహులే" అంటూ ఆయన మండిపడ్డారు.
బీజేపీ రైతు భరోసా యాత్రలో భాగంగా గజ్వేల్ మార్కెట్కు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రైతులతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బీజేపీ నాయకులకు వివరించారు. రైతులకు "మేమున్నాం" అనే భరోసాను బీజేపీ నేతలు కల్పించారు.
బీజేపీ నేతలు వస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ధాన్యాన్ని తరలించే ప్రయత్నం చేశారని రామచంద్రరావు ఆరోపించారు. "ఇన్ని రోజులు ప్రభుత్వం నిద్రపోయిందా..? నెల రోజులుగా రైతులు కన్నీరు మున్నీరవుతుంటే పాలకులు ఏమి చేస్తున్నారు..?" అని ఆయన ప్రశ్నించారు.
రోడ్లపై ధాన్యం తడుస్తూ ఉండగా, వడ్లు మొలకెత్తుతున్నా కొనుగోలు కేంద్రాలు స్పందించడం లేదని విమర్శించారు. పొద్దుతిరుగుడు పంట కూడా నెల రోజులుగా కొనుగోలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. "50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా అబద్ధం. ఇప్పటికీ రింగ్ రోడ్ చుట్టూ, గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
రైతుకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులకు అండగా నిలిచి ఉద్యమం చేస్తారని రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.











