కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం రాజంపేట మండలంలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, కొనుగోలు ప్రక్రియను, అధికారుల పనితీరును సమీక్షించారు. రైతుల సౌకర్యార్థం అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం రాజంపేట మండలంలోని రాజంపేట, అరగొండ, ఎల్లారెడ్డిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కాంటా వేసి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాల పరిశీలనలో పారదర్శకత పాటించాలని సూచించారు.
రాజంపేట మండలం, అరగొండ PACS పరిధిలోని అరగొండ గ్రామంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న సేకరణ కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. లారీ లోడింగ్ పనులను దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్, మిగిలి ఉన్న మొక్కజొన్నను వెంటనే సేకరించేలా తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయాలని, అలాగే సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన గోదాములకు తరలించేందుకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని DM Markfed ను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని వరి, మొక్కజొన్న నిల్వలో ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని భద్రపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ పర్యటనలో DCO, DCSO, DMCS, DM Markfed, DMO, MSO, తహసీల్దార్, MAO, MEOలు, సర్పంచులు, PACS చైర్మన్లు, PACS సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.












