సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతుల సౌకర్యార్థం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రస్తుత ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, నీడ, ORS ప్యాకెట్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్న నాణ్యతను, తేమ శాతాన్ని నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
కొనుగోలు అనంతరం లిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్కు సంబంధించి డీఎం మార్క్‌ఫెడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, రవాణా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించామని, మిగిలిన స్టాక్‌ను 10 రోజుల్లో తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొక్కజొన్న తూర్పార పట్టే విధానాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. కొనుగోలు, తూర్పార పట్టడం, రవాణా ప్రక్రియలు సమన్వయంతో కొనసాగాలని ఆదేశించారు.












