సంగారెడ్డి ప్రతినిధి, జూలై 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): భూమి కోసం,భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి నెలకొరిగిన, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 79వ వర్దంతి సందర్బంగా పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ , జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్నీ అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమరత్వాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చిన వారే దొడ్డి కొమురయ్య అని అన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తలచుకోగానే మొదటగా గుర్తు వచ్చేది పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, తెలంగాణలో భూస్వామ్యపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమడానికి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే ప్రధాన కారణమన్నారు. వీరుల గాధలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీరుల జయంతి, వర్దంతిలను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని, నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి జగదీష్, వెనుకబడిన తరగతుల కుల సంఘం నాయకుల అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, పుష్ప నగేష్ యాదవ్, బీరయ్య యాదవ్, ప్రభుగౌడ్, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితర కుల నాయకులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని కొనసాగించాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య
Published On: July 4, 2025 6:33 pm
