సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా జీపీవో పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ హైటెక్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు. హైదరాబాద్ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభ్యర్థులు హైదరాబాద్‌కు చేరుకునే విధంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందించి, సమయానికి హైటెక్స్‌కు చేర్చాలని ఆదేశించారు. నియామక కార్యక్రమానికి సంబంధించి సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులకు కూడా సమాచారం ఇవ్వాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురీ, డిఆర్ఓ పద్మజారాణి, కలెక్టరేట్ ఏఓ ఆంథోనీ పాల్గొన్నారు. ఈ కాన్ఫిరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 239 అభ్యర్థులు ఎంపికైనట్లు వివరించారు. ఇందులో స్థానిక కోటా కింద 209, స్థానికేతర కోటా కింద 10 పోస్టులు కేటాయించగా, అదనంగా 20 పోస్టులను మెదక్ జిల్లాకు అలాట్మెంట్ చేసినట్లు వివరించారు. అభ్యర్థుల రవాణా సౌకర్యం కోసం ఉచిత బస్సులు, లైజన్ అధికారులను, పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. అభ్యర్థులు మధ్యాహ్నం 2 గంటలలోపు హైటెక్స్‌కు చేరుకోవాలని సూచించారు.
జీపీవో అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీకి ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: September 3, 2025 6:40 pm