ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి బి.సౌజన్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని, వైద్యంకు మూలం ఆయుర్వేదమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి బి.సౌజన్య సూచించారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ, ఎంప్లాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెన్నార్ ఆసుపత్రి సహకారంతో సంగారెడ్డి విద్యానగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ… ఆయుర్వేద బ్రహ్మ ధన్వంతరి వారసత్వం కలిగిన నాయి బ్రాహ్మణుల సేవలు నేటి సమాజంలో ప్రశంసనీయమని కొనియాడారు. బ్రిటిష్ వారి పాలనలో భారతీయ ఆయుర్వేదం నిర్లక్ష్యం చేయబడిందన్నారు. నేటి స్వతంత్ర భారతంలో ఆయుర్వేదం యొక్క విశిష్టత పెరిగి విరివిగా ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. అనారోగ్య సమస్యలతో ఇతర దేశాల నుండి మన దేశంలోని ఆయుర్వేద ప్రకృతి వైద్యశాలలకు వస్తున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని సూచించారు. ఎంఎన్ఆర్ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను అభినందించారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయ సేవలను అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడం ద్వారా న్యాయ పరిరక్షణ పొందవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఉచిత న్యాయ సహాయ సేవలు, మధ్యవర్తిత్వం, లోకాధాలత్‌ల ద్వారా వివాద పరిష్కారం, పింఛన్, సేవా ప్రయోజనాలు, మహిళా, వృద్ధుల హక్కులు, ఆస్తి వివాదాలు, వినియోగదారుల రక్షణ చట్టాలు వంటి అంశాలపై వివరించారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో వ్యాధుల సంబంధించిన అన్ని పరీక్షలతో పాటు మహిళలకు సంబంధించిన పరీక్షలు, షుగర్‌, బిపి, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, ఎంఎన్ఆర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment