ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

కాంగ్రెస్
Headlines
  1. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? – బీజేపీ ప్రశ్న
  2. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తారా?
  3. నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక హామీలు అమలు కావాలి
  4. జహీరాబాద్ పరిశ్రమల సమస్యలు, స్థానికుల ఉద్యోగావకాశాలు
  5. బీఆర్‌ఎస్ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ జవాబివ్వాలి
IMG 20241202 181750
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి గోదావరి అంజిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని. ఈ పథకాలకు బీఆర్ఎస్ హయాంలో రు. 4,500 వేల కోట్ల అంచనాలతో శంకుస్థాపన జరిగి.. టెండర్లు ఖరారైనా పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంలో జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి ప్రాంతాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీలు ఎత్తిపోయాలనేది ప్రణాళిక అని, మూడు నియోజకవర్గాలల్లో 11 మండలాల పరిధిలోని 240 గ్రామాల పరిధిలోని రెండు లక్షల 19 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యం అని అన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మంజీర నది నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లోని 166 గ్రామాల పరిధిలోని లక్షా 77 వేల ఎకరాలను నీరు అందించాలని రూపొందించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగింది కానీ పనులు ప్రారంభం కాలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎత్తిపోతల పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. కానీ వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించారని, కానీ పనులు మాత్రం పట్టాలెక్కలేదని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల సభలో ప్రకటించారని గుర్తు చేశారు. నారాయణఖేడ్ భవిత- సంజీవరెడ్డి బాధ్యత అని, ఖేడ్ అభ్యర్థిగా సంజీవరెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. నల్లవాగు లిఫ్ట్ పనులు, తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. చెరకు కొట్టేందుకు మూడు నెలలు వలస వెళ్లే రైతు కూలీలను ఆదుకోవాలని కోరారు. సంగారెడ్డి నియోజకవర్గంలో పేదలందరికి 100 గజాల చొప్పున ఇంటి జాగా ఇస్తామని, ఇందుకు 2 వేల ఎకరాలు రైతుల నుంచి కొని ఇప్పిస్తానని జగ్గారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 2013లో సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో వేలాది మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను బీఆర్ఎస్ రద్దు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ వాళ్లకు స్థలాలు ఇప్పిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో చెరకు రైతుల సమస్యలు పరిష్కారం చేస్తానని అభ్యర్థి చంద్రశేఖర్ హామీ ఇచ్చారని, నిమ్జ్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చేస్తానని ప్రచారం చేశారని తెలిపారు. అల్లం, ఆలుగడ్డ నిల్వ కోసం మండలాల్లో కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా అందోల్ నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు భారీగా నిధులు తెస్తానని దామోదర రాజనర్సింహ హమీ ఇచ్చారని,విద్యాపరంగా పలు కాలేజీలు ఏర్పాటు చేస్తానని ప్రచారం చేశారని గుర్తు చేశారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, ఎడ్ల రమేష్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శులు అనంతరావు కులకర్ణి, మాణిక్ రావు, రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్, బీజేపీ ఉపాధ్యక్షులు పోచారం రాములు, నర్సింగ్ రావు, పటాన్ చేరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎల్లన్న, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

 

Join WhatsApp

Join Now