తెలుగు భాష – సాంస్కృతుల శ్వాస

*పల్లవి:*
తెలుగు భాషయన్న తేటతెల్లమే
తెలుగు పదములన్న చెరుకు రసమే
తెలుగు భాష మిన్న తేజమేమున్నది
తెలుగు పరవళ్ళకు అడ్డు ఏమున్నది.

*చరణం:*
యాసలెన్ని ఉన్న కమ్మదనమే
ఇరుపు లెన్ని ఉన్న సొగసు దనమే
పలుకు బళ్ళ తోడ పరవశించెను
సామేతల కూడి సోద్యమే ఇచ్చేను.

హృదయాల కలిపేటి హృద్యభాష
దూరాల చెరిపేటి రమ్య ఘోష
కృష్ణ, గోదారుల మేళమే తెలుగు
దాశరథి, సినారె రవళులే ఆంధ్రము.

కనుసన్నలు తాను కాటుకల రాసేను
హావభావాలను కుసుమంగ విరిసేను
కన్నీటి ఆర్థతను తూకమేయు వెలుగు
పౌరుషాల పొంగు రౌద్రమే తెలుగు.

సాహిత్య శోధనకు అందినది తెలుగు
విజ్ఞాన ఘంటికలు పారునది అలుగు
పాట పరవశాన అందియలు మ్రోగింది
పద్య సేద్యములో తేనియలు పారింది.

*(తేదీ: 29-08-2025 తెలుగు భాష దినము)*
*రచన, ఆర్ధకవి, వాగ్గేయకారుడు: శ్రీ తాటి కిషన్‌* *M.A  (Telugu)., M.A. (English)., M.Ed**సెల్‌: 9052454349*

Join WhatsApp

Join Now

Leave a Comment