తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటును హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక GCC పాలసీని రూపొందించాలని, జిల్లాల్లో GCCలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.
అంతర్జాతీయ సంస్థల నుంచి GCCల ఏర్పాటుకు పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో, హైదరాబాద్ అవతలి ప్రాంతాలను (Beyond Core Urban Region) గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో, ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల హైవేల వెంట GCCలు, డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని, ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించి, ప్రపంచంలోనే అత్యుత్తమ సదుపాయాలతో నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీలో ఏర్పాటు అయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు.
రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేందుకు, ఇన్వెస్టర్లకు ఎండ్-టు-ఎండ్ సేవలు అందించే వ్యవస్థగా 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సొసైటీలో ఐటీ, పరిశ్రమల శాఖలతో పాటు ఇంధన, ఆర్థిక శాఖల సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను సమన్వయం చేయడానికి ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్‌ను కేటాయించాలని, అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూడు నెలల్లోపు టి-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.











