టెలికాం కంపెనీలు అందించే నెలవారీ రీఛార్జ్ ప్లాన్లలో 28 రోజుల వాలిడిటీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారులకు ఏడాదికి 13 రీఛార్జ్ లు చేయాల్సిన పరిస్థితిని నివారించేందుకు, కనీసం ఒక 30 రోజుల వాలిడిటీ ప్లాన్ ను తప్పనిసరిగా అందించాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.
రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ, జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్-ఐడియా వంటి సంస్థలు తమ ప్లాన్లలో ఒకటైనా పూర్తి 30 రోజుల వాలిడిటీతో ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే ఈ నిబంధన ఉన్నా, కంపెనీలు దానిని ప్రజలకు విస్తృతంగా తెలియజేయడం లేదని, ఇకపై ఈ ప్లాన్ల గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.
డేటా వినియోగంపై కూడా వినియోగదారుల సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. రోజుకు నిర్దిష్ట డేటా ప్లాన్లలో, వినియోగించని మిగిలిన డేటాను తరువాతి రోజుకు బదిలీ చేసే 'డేటా రోల్-ఓవర్' సౌకర్యం కల్పించాలని ఎంపీ కోరారు. ప్రస్తుతం, వినియోగించని డేటా రాత్రి 12 గంటలకు గడువు ముగిసిపోతోంది, ఇది వినియోగదారులకు నష్టదాయకం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంకా, రీఛార్జ్ గడువు ముగిసినప్పటికీ ఇన్కమింగ్ కాల్స్ ను వెంటనే నిలిపివేయడం సరికాదని, కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ కాల్స్ ను కొనసాగించేలా చూడాలని ఎంపీ సూచించారు. ప్రస్తుతం, 90 రోజుల పాటు ఫోన్ వాడకపోతేనే సిమ్ కార్డును డీయాక్టివేట్ చేసే నిబంధన ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ రెండు కీలక అంశాలపై దృష్టి సారించి, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా త్వరలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.











