సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో బీసీ గణన అవసరం, అమలు విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కులను పరిరక్షించేందుకు కులగణన కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బీసీ గణన ప్రక్రియను ప్రారంభించి, తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ గణన ద్వారా వారికి తగిన ప్రాతినిధ్యం, ప్రభుత్వ పథకాల్లో న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.