*హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు:* *బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేశారని, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ లు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రాల సీఎం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడరని, సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని పేర్కొన్నారు. అమలు కాని హామీ ఇచ్చి కాంగ్రెస్ గద్దనెక్కిందని, రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేశారని తెలిపారు. హరీష్ రావు పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని.. ఇదే సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఏది కూడా సరిగ్గా చేయలేదని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని వారు తెలిపారు. అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేకుండా పోయిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు కాక మీద ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ గ్రామాల్లో పర్యటిస్తే అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఇప్పటి వరకు రైతుబంధు లేదని, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇప్పటికి లేదని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తుందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావులు తెలిపారు. ఈ సమావేశంలో సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, జలేంధర్ రావు, శ్రీనివాస్, మోహన్ సింగ్, శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now