*’భూ భారతి’తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ గౌతం*
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ విద్యాసాగర్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గౌతం మాట్లాడుతూ, భూ భారతి ఆర్ఓఆర్ చట్టంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గతంలోని 1989 ఆర్ఓఆర్ చట్టంలోని అంశాలతో భూ భారతిలోని అంశాలకు కొంత సారూప్యత ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులకు ధరణిలో లేని ప్రత్యేక అధికారాలు ఈ కొత్త చట్టంలో పొందుపరచబడ్డాయని ఆయన తెలిపారు. ఈ అదనపు అధికారాలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూముల రికార్డుల నిర్వహణ పూర్తిగా ఆన్‌లైన్ మరియు డిజిటల్ విధానంలో జరగాలని ఆయన స్పష్టం చేశారు.
నూతన విధానాలపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే వరకు మాన్యువల్‌గా ప్రొసీడింగ్స్ నిర్వహించాలని, కొత్త మార్గదర్శకాల ప్రకారం భూముల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం అనేక నూతన అంశాలను చేర్చి ఈ ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని రూపొందించిందని, భవిష్యత్తులో ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థ అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. భూ భారతి 2025 చట్టంలో మొత్తం 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని ఆయన వివరించారు.
ఆధార్ తరహాలోనే భూములకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి కొలతలు, హద్దులతో కూడిన ‘భూధార్’ను ప్రభుత్వం తీసుకురానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని, భూమి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ ప్రక్రియలకు ముందు తప్పనిసరిగా భూమి సర్వే చేసి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల సమస్యల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం అవుతుందని, వారసత్వ భూముల మ్యూటేషన్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, హక్కుల బదలాయింపులను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
భూ సమస్యల పరిష్కారానికి రెండు స్థాయిల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా రైతులకు న్యాయమైన మార్గం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. నివాస స్థలాలు, ఆబాది భూములు, వ్యవసాయేతర భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ శాస్త్రీయంగా జరుగుతుందని, మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూముల పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం ద్వారా లభిస్తుందని ఆయన తెలిపారు. భూ భారతి రైతులకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని కలెక్టర్ గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు.
భూ సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడే భూ భారతి చట్టంపై ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 19 నుండి జిల్లాలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఈ సదస్సుల ద్వారా ప్రజలకు మరియు రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, ఆర్డీఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.