రెసిడెన్షియల్ స్కూల్‌లో వసతుల కల్పనకు కలెక్టర్ హామీ

*రెసిడెన్షియల్ స్కూల్‌లో వసతుల కల్పనకు కలెక్టర్ హామీ*

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 4

విద్యార్థులు కోరిన మేరకు రెసిడెన్షియల్ స్కూల్‌లో డ్రైనేజీ, సైన్స్ ల్యాబ్, అదనపు టాయిలెట్లు తప్పకుండా అందిస్తామని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన హితవు పలికారు.

శుక్రవారం మేడ్చల్ మండలంలోని కిష్టాపూర్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కాలేజీ (బాలికలు)ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కృషి, పట్టుదల, క్రమశిక్షణతో బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత చదువులు ఏమి చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు.

స్కూల్‌లో వసతులు, భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనశాలలో టేబుళ్లు, కుర్చీలు విద్యార్థులకు సరిపడా ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకొని, మెను చార్టును పరిశీలించారు. శుక్రవారం రోజు మెనులో ఏమి వండారని అడిగి, వంటలను పరిశీలించారు. స్కూలు, కాలేజీ కలిపి మొత్తం ఎంత మంది విద్యార్థులున్నారని, ఇంటర్‌లో ఏఏ గ్రూపులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌లోని వంట సామాగ్రి నాణ్యతను పరిశీలించి, ఎక్స్‌పైరీ డేట్ నమోదుకు రిజిస్టర్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రెండవ అంతస్తులో నిర్మాణంలో ఉన్న హాలును కలెక్టర్ పరిశీలించారు.

స్కూల్ ప్రిన్సిపల్ లలిత, జోనల్ ఆఫీసర్ రజిత స్కూలులో ఉన్న మేజర్, మైనర్ రిపేర్లకు నిధులు కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ పరిశీలించి కొత్త డ్రైనేజీ పైప్‌లైన్, టాయిలెట్ల రిపేర్లు, దోమల నివారణకు మెష్, ఫ్లోరింగ్ వంటి పనులకు అయ్యే ఖర్చుల అంచనా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment