నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య వైద్యులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్‌ ఉమా హారతితో కలిసి నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మరియు మాతా-శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్  ఔట్‌ పేషెంట్, ఇన్‌పేషెంట్ వార్డు, లేబర్ రూమ్, మాతా-శిశు సంరక్షణ విభాగం, ఫార్మసీ, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, జనరేటర్ విభాగాలను సమీక్షించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్, మెడిసిన్ స్టాక్, రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పేషంట్లతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యసేవల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వానాకాలంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు, రక్త పరీక్ష కిట్లు, తగినంత సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్బంగా డి.సి.హెచ్ అధికారి ఆసుపత్రిలో 50 పడకల అదనపు వార్డు అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ సంబంధిత ప్రపోజల్ పంపాలని సూచించారు. ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జనరేటర్‌లో సాంకేతిక లోపాలు లేకుండా ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం డయాలసిస్ సెంటర్‌ను కూడా పరిశీలించి, అందులోని సదుపాయాల స్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, రెవెన్యూ అధికారులు, వైద్యలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment