నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేసే ఉద్దేశ్యంతో గురువారం గ్రామసభ నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, నస్రుల్లాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ మోసాల నుంచి ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలకు గురైన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు సైతం ఫోన్ ద్వారా ఓటీపీలు అడగరని, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
అలాగే, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పోలీసు సిబ్బంది ప్రభాకర్, సాయిలు పాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై ఓ. గంగారాం, పీసీ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సుంచు జమున మోహన్, ఉప సర్పంచ్ బసొల్లా సుగుణ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్థులు కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించి, పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను అభినందించారు.












