కామారెడ్డి జిల్లాలోని గర్గుల్ గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతూ రైతులు, పశువులకు ముప్పుగా మారాయి. విద్యుత్ స్తంభాలు వంగిపోవడం, వైర్లు కిందకు జారిపోవడంతో వ్యవసాయ పనులు నిర్వహించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గర్గుల్ గ్రామ వడ్లూరు శివారులో 11కేవీ విద్యుత్ లైన్లకు సంబంధించిన వైర్లు చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు వినియోగించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు.
ఈ సమస్యను గతంలో పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, లైన్ మెన్ కు చెప్పినా ఫలితం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగాక స్పందించడం కంటే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వేలాడుతున్న వైర్లను సురక్షిత స్థితికి తీసుకురావాలని, దెబ్బతిన్న స్తంభాల మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గర్గుల్ గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.










