అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించింది. ఎఫ్.సి.ఆర్.ఏ అనుమతులు పునరుద్ధరణ కావడంతో నిలిచిపోయిన విదేశీ నిధుల ప్రవాహం తిరిగి ప్రారంభం కానుంది.
గత కొంతకాలంగా ఆర్డీటీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ ను కేంద్రం పొడిగించలేదు. దీంతో సంస్థ అందిస్తున్న విద్య, వైద్య, సామాజిక సేవలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, సమస్య పరిష్కారానికి కృషి జరిగింది.
మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆర్డీటీ చేస్తున్న నిస్వార్థ సేవలను, మానవతా దృక్పథాన్ని వివరిస్తూ, సంస్థపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని గణాంకాలతో సహా వివరించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఆర్డీటీకి క్లీన్ చిట్ లభించేలా చూడటంలో, సంస్థపై ఉన్న అపోహలను తొలగించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఫాదర్ మాంఛో ఫెర్రర్ ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాలు కొనసాగేలా ఆయన కృషి చేశారు.
కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్.సి.ఆర్.ఏ అనుమతులు మంజూరు కావడంతో ఆర్డీటీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగనున్నాయి. ఈ పరిణామం సంస్థ లబ్ధిదారులలో ఆశాకిరణం నింపింది.











