పిట్లం మండలంలోని చిల్లర్గీ జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం (24-03-2026) పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మోసాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పిట్లం సబ్-ఇన్స్పెక్టర్ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కళాబృందం పాటలు, మాటల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం నింపింది. మైనర్లపై నేరాలు, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు.
సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత వహించాలని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటి ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మానవ అక్రమ రవాణా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, చిన్న తప్పిదాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు.
విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువుకోవాలని, తల్లిదండ్రుల మాట వినాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, షీ టీమ్ నంబర్ 8712686094 లకు సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు, స్థానిక పోలీసులు, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












