సదాశివపేట, 2026-08-03
సంగారెడ్డి జిల్లా అయ్యప్ప సేవా సమాజం జిల్లా అధ్యక్షుడు గోనె శంకర్ ఆధ్వర్యంలో సదాశివపేటలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. అయ్యప్ప సేవను ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవకు విస్తరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
సంగారెడ్డి జిల్లా అయ్యప్ప సేవా సమాజం జిల్లా అధ్యక్షుడు గోనె శంకర్ ఆధ్వర్యంలో సదాశివపేటలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు సుధాకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, సభ్యులు జింకల శ్రీనివాస్, హరిశంకర్ గౌడ్, పులి బలవంత్ రావు, అయ్యప్ప సేవా సమాజం ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోనె శంకర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి సేవ అనేది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవకు కూడా దోహదపడాలని అన్నారు. విద్య, వైద్యం, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాలను భక్తుల సహకారంతో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. జిల్లా అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో భక్తులను ఏకం చేస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి భక్తుడు సేవా భావంతో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని కోరారు.
అయ్యప్ప భక్తుల సంక్షేమం, ఆలయ అభివృద్ధి, రానున్న మండలమకర విలక్కు మహోత్సవాల నిర్వహణ, సేవా కార్యక్రమాల విస్తరణ, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వంటి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప సేవా సమాజాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి మండలంలో భక్తుల సమన్వయంతో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. సంస్థ బలోపేతంతో పాటు భక్తుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.











